అధ్యాయములు:
1దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసినపనినిగూర్చి మేము చెవులార విని యున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి
2నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్లగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి.
3వారు తమ ఖడ్గముచేత దేశమును స్వాధీనపరచు కొనలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను.
4దేవా, నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ కలుగ నాజ్ఞాపించుము.
5నీవలన మా విరోధులను అణచివేయుదుము నీ నామమువలననే, మామీదికి లేచువారిని మేము త్రొక్కి వేయుదుము.
6నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు
7మా శత్రువుల చేతిలోనుండి మమ్మును రక్షించు వాడవు నీవే మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే.
8దినమెల్ల మేము దేవునియందు అతిశయపడుచున్నాము నీ నామమునుబట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.(సెలా.)
9అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమాన పరచియున్నావు. మాసేనలతోకూడ నీవు బయలుదేరకయున్నావు.
10శత్రువులయెదుట నిలువకుండ మమ్మును వెనుకకు పారి పోజేయుచున్నావు మమ్మును ద్వేషించువారు ఇష్టమువచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారు.
11భోజనపదార్థముగా ఒకడు గొఱ్ఱలను అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టి యున్నావు
12అధికమైన వెల చెప్పక ధనప్రాప్తిలేకయే నీవే నీ ప్రజలను అమి్మ యున్నావు
13మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పద ముగా చేసియున్నావు మా చుట్టు నున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణ ముగాను మమ్మును ఉంచి యున్నావు.
14అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు.
15నన్ను నిందించి దూషించువారి మాటలు వినగా శత్రువులనుబట్టియు పగ తీర్చుకొనువారినిబట్టియు
16నేను దినమెల్ల నా అవమానమును తలపోయుచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది.
17ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువ లేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు.
18మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు.
19అయితే నక్కలున్నచోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు గాఢాంధకారముచేత మమ్మును కప్పియున్నావు
20మా దేవుని నామమును మేము మరచియున్నయెడల అన్యదేవతలతట్టు మా చేతులు చాపియున్నయెడల
21హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా?
22నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాము వధకు సిద్ధమైన గొఱ్ఱలమని మేము ఎంచబడు చున్నాము
23ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము.
24నీ ముఖమును నీ వేల మరుగుపరచి యున్నావు? మా బాధను మాకు కలుగు హింసను నీవేల మరచి యున్నావు?
25మా ప్రాణము నేలకు క్రుంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది.
26మా సహాయమునకు లెమ్ము నీ కృపనుబట్టి మమ్మును విమోచింపుము.