అధ్యాయములు:
1యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రముచేయుట ఒప్పిదము.
2యెహోవాయే యెరూషలేమును కట్టువాడు చెదరిన ఇశ్రాయేలీయులను పోగుచేయువాడు
3గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు.
4నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు.
5మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు.
6యెహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును.
7కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. సితారాతో మన దేవుని కీర్తించుడి.
8ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమికొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతములమీద గడ్డి మొలిపించువాడు
9పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు.
10గుఱ్ఱముల బలమునందు ఆయన సంతోషించడు నరులకాలిసత్తువయందు ఆయన ఆనందించడు.
11తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు.
12యెరూషలేమా, యెహోవాను కొనియాడుము సీయోనూ, నీ దేవుని కొనియాడుము.
13ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి యున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి యున్నాడు.
14నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే
15భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును.
16గొఱ్ఱబొచ్చువంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిదవంటి మంచు కణములు చల్లువాడు ఆయనే.
17ముక్కముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు?
18ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నియు కరిగిపోవును ఆయన తనగాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును,
19ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను.
20ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి. యెహోవాను స్తుతించుడి.