అధ్యాయములు:
1అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.
2మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.
3అప్పుడుఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.
4ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.
5అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడుఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు–ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు.
6మరియు ఆయన నాతో ఇట్లనెనుసమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.
7జయించువాడు వీటిని స్వతంత్రించు కొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై యుండును.
8పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
9అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి,
10ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోక మందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.
11దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది.
12ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను; ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి, ఇశ్రా యేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడియున్నవి.
13తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపువైపున మూడు గుమ్మములు, దక్షిణపు వైపున మూడు గుమ్మములు, పశ్చిమపువైపున మూడు గుమ్మము లున్నవి.
14ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైనగొఱ్ఱ పిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి.
15ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను.
16ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.
17మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబదినాలుగు మూరలైనది; ఆ కొలత దూతకొలతయే.
18ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.
19ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ,
20అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము.
21దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.
22దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱపిల్లయు దానికి దేవాలయమై యున్నారు.
23ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱపిల్లయే దానికి దీపము.
24జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు.
25అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు.
26జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు.
27గొఱ్ఱపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయబడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.