మార్కు 13వ అధ్యాయము

అధ్యాయములు:

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

1ఆయన దేవాలయములోనుండి వెళ్లుచుండగా ఆయన శిష్యులలో ఒకడుబోధకుడా, యీ రాళ్లేలాటివో యీ కట్టడములు ఏలాటివో చూడుమని ఆయనతో అనెను.
2అందుకు యేసుఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే; రాతిమీద రాయి యొకటియైన ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని అతనితో చెప్పెను.
3ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండమీద కూర్చుండియుండగా, పేతురు యాకోబు యోహాను అంద్రెయ అను వారు ఆయనను చూచి
4ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నియు నెరవేరబోవుకాలమునకు ఏ గురుతు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంత మందు అడుగగా
5యేసు వారితో ఇట్లు చెప్పసాగెను ఎవడును మిమ్మును మోసపుచ్చకుండ చూచుకొనుడి.
6అనేకులు నా పేరట వచ్చినేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు.
7మీరు యుద్ధములను గూర్చియు యుద్ధసమాచారములను గూర్చియు విను నప్పుడు కలవరపడకుడి; ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.
8జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరవులు వచ్చును. ఇవే వేద నలకుప్రారంభము.
9మిమ్మునుగూర్చి మీరే జాగ్రత్తపడుడి. వారు మిమ్మును సభల కప్పగించెదరు; మిమ్మును సమాజమందిరములలో కొట్టించెదరు; మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల యెదుటను రాజుల యెదుటను నా నిమిత్తము నిలువబడె దరు.
10సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింప బడవలెను.
11వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవు నప్పుడు మీరుఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి; చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు.
12సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమున కప్పగింతురు; కుమారులు తలిదండ్రులమీద లేచి వారిని చంపింతురు;
13నా నామము నిమిత్తము అందరిచేత మీరు ద్వేషింపబడుదురు; అంతమువరకు సహించినవాడే రక్షణ పొందును.
14మరియు నాశకరమైన హేయవస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు చదువు వాడు గ్రహించుగాకయూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను;
15మిద్దెమీద ఉండువాడు ఇంటిలోనుండి ఏదైనను తీసికొనిపోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు;
16పొలములో ఉండువాడు తన వస్త్రము తీసికొనిపోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు.
17అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికిని శ్రమ.
18అది చలికాలమందు సంభవింపకుండ వలెనని ప్రార్థించుడి.
19అవి శ్రమగల దినములు; దేవుడు సృజించిన సృష్ట్యాదినుండి ఇదివరకు అంత శ్రమ కలుగ లేదు, ఇక ఎన్నడును కలుగబోదు.
20ప్రభువు ఆ దినములను తక్కువచేయనియెడల ఏ శరీరియు తప్పించు కొనక పోవును; ఏర్పరచబడినవారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారినిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను.
21కాగాఇదిగో క్రీస్తు ఇక్కడ నున్నాడు, అదిగో అక్కడ నున్నాడు అని యెవడైనను మీతో చెప్పినయెడల నమ్మకుడి.
22ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైనయెడల ఏర్పరచబడినవారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు.
23మీరు జాగ్రత్తగా ఉండుడి; ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి యున్నాను.
24ఆ దినములలో ఆ శ్రమతీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును,
25ఆకాశమందలి శక్తులు కదలింపబడును.
26అప్పుడు మనుష్యకుమారుడు మహా ప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు.
27అప్పుడాయన తన దూతలను పంపి, భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతమువరకు నలుదిక్కులనుండి తాను ఏర్పరచుకొనినవారిని పోగు చేయించును.
28అంజూరపుచెట్టును చూచి యొక ఉపమానము నేర్చు కొనుడి. దాని కొమ్మ యింక లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియును.
29ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచు నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలిసికొనుడి.
30ఇవన్నియు జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.
31ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు.
32ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూత లైనను, కుమారుడైనను ఎరుగరు.
33జాగ్రత్తపడుడి; మెలకువగానుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు.
34ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి, ప్రతివానికి వాని వాని పని నియమించిమెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి, యిల్లు విడిచి దేశాంతరము పోయినట్టే (ఆ కాలము ఉండును.)
35ఇంటి యజమానుడు ప్రొద్దు గ్రుంకివచ్చునో, అర్ధరాత్రివచ్చునో, కోడికూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, యెప్పుడు వచ్చునో మీకు తెలియదు.
36ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రబోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి.
37నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను; మెలకువగా నుండుడనెను.