సామెతలు 13వ అధ్యాయము

అధ్యాయములు:

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

1తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు.
2నోటి ఫలముచేత మనుష్యుడు మేలు ననుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారముచేత నశించుదురు.
3తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చు కొనును.
4సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును.
5నీతిమంతునికి కల్ల మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును.
6యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును.
7ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనముగలవారు కలరు.
8ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యముప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదరింపు మాటలు వినడు.
9నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును.
10గర్వమువలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును.
11మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధిచేసి కొనును.
12కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము.
13ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును ఆజ్ఞవిషయమై భయభక్తులుగలవాడు లాభముపొందును.
14జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును.
15సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము.
16వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును.
17దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధమువంటివాడు.
18శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును.
19ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము.
20జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవా డగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.
21కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును.
22మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును.
23బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయమువలన నశించువారు కలరు.
24బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.
25నీతిమంతుడు ఆకలితీర భోజనముచేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును.